ఇకమీద బాయిల్డ్‌ రైస్‌ కొనం.. స్పష్టం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ : ఇకమీద బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. ప్రస్తుతం రబీ పంట సీజన్‌ ఇంకా ప్రారంభం కాలేదని, రబీ ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో చర్చించాల్సి ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది ఎంత బియ్యం సేకరించాలో నిర్ణయిస్తామని చెప్పింది. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో విధంగా డిమాండ్‌ ఉంటుందని, గత నిర్ణయాల మేరకు ఇప్పటి వరకు బాయిల్డ్‌ రైస్‌ సేకరించామని స్పష్టం చేసింది.

ఇకపై బాయిల్డ్‌ రైస్‌ కేంద్రం కొనదని.. వరి, గోధుమ తక్కువ పండించాలని కోరుతున్నట్లు పేర్కొన్నది. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం, గోధుమ నిలువలు ఉన్నాయని.. ఇకపై నిలువ చేసే పరిస్థితి లేదని చెప్పింది. దేశీయ అవసరాలు, ఎగుమతుల మేరకు నిర్ణయం ఉంటుందని తెలిపింది. ఎగుమతి అవకాశాలను పరిగణలోకి తీసుకుంటున్నామన్న కేంద్రం.. ఎగుమతులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని పేర్కొంది.

ఈ సందర్భంగా రైతులు ప్రత్నామ్నాయ పంటలు వేయాలని సూచించింది. నూనె, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగు చేయాలని, అన్ని రాష్ట్రాలకు ఇదే సూచనలు చేస్తామంది. రాష్ట్రాలు సేకరించేంత వరకే పరిమితం కావాలని సూచించింది. గతంలో తెలంగాణ నుంచి 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు, 40లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. రాష్ట్రాలతో చర్చించిన తర్వాత ధాన్యం, బియ్యం సేకరణ జరిగినట్లు ఆహార, వినియోగదారుల మంత్రిత్వ శాఖ వివరించింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/