తిరుపతి నగరం జలమయం

జిల్లాలో పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవు

చిత్తూరు : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి భారీ వర్షాలతో జలమయం అయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మాధవ నగర్, గొల్లవానిగుంట, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల కింద భారీగా వర్షపు నీరు చేరింది. అటు కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండడంతో చిత్తూరు జిల్లాలో పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హరినారాయణన్ వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా జిల్లాకు తీసుకువచ్చినట్టు వివరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/