విభజన సమస్యలపై కేంద్రం భేటి..ఇరు రాష్ట్రాల సీఎస్‌లు హాజరు

central-government-meeting-on-ap-division-problems

న్యూఢిల్లీః రాష్ట్ర విభజన అంశాలపై ఈరోజు కేంద్ర హోంశాఖలో కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ఉదయం 11 గం.లకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర హోంశాఖ అధికారులు, ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశం ఎజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు అంశాలు ఇరు రాష్ట్రాలకు చెందిన ద్వైపాక్షిక అంశాలు కాగా, మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు. ప్రభుత్వ కంపెనీలు-కార్పొరేషన్‌ల విభజన, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, చట్టంలో పేర్కొనని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన, బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వల బ్యాలెన్స్ విభజన.. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు.

ఇక ఏపీకి సంబంధించి.. ఏపీ నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, ఏపీ విభజన చట్టం కింద పన్ను రాయితీలు, ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు, పన్ను మదింపులో పొరపాట్ల సవరణ, నూతన విద్యాసంస్థల ఏర్పాటు, నూతన రాజధానికి రాపిడ్ రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు అంశాలపై చర్చ జరగనుంది. ఇప్పటి వరకు విభజన సమస్యలపై హోం శాఖ ఆధ్వర్యంలో 25 సార్లు సమావేశాలు జరిగాయి. ఈ ఏడాదిలోనే ఇప్పటికి మూడుసార్లు అధికారులు భేటీ అయ్యారు. ఈ రోజు నాలుగోసారి సమావేశం కానున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/