దసరా ఎఫెక్ట్ : ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌

పెద్ద పండగ వస్తుందంటే చాలు ప్రయాణికులను నిలువు దోపిడీ చేసేందుకు ప్రైవేటు ట్రావెల్స్‌ సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం దసరా పండగను అలాగే క్యాష్ చేసుకుంటుంది. తెలంగాణ లో అతి పెద్ద పండగ దసరా. ఈ పండగను తెలంగాణ ప్రజలు ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. దేశం లో ఎక్కడ ఉన్న సరే..దసరా కు సొంత ఊర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషం గా పండగను జరుపుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రభుత్వం సైతం ఇప్పటికే స్కూళ్లు, విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో కొంతమంది ఊళ్లకు వెళ్లిపోయారు. కొంతమంది ఈ నెలాఖరు, వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలోని పలు ప్రైవేటు ట్రావెల్స్‌ ఈ నాలుగైదు రోజులు ఛార్జీలను భారీగా పెంచేశారు.

ఏసీ స్లీపర్‌, ఏసీ సీటర్‌, నాన్‌ ఏసీ స్లీపర్‌, నాన్‌ ఏసీ సీటర్‌లో ధరలు పెంచేసాయి. రూట్‌ను బట్టి, డిమాండ్ ఉన్న మార్గాల్లో రేట్లు అమాంతం పెంచారు. విజయవాడ-విశాఖ రూట్ గమనిస్తే మామూలుగా ఆర్టీసీ ఏసీ సర్వీసుల్లో రూ.750పైన ఉంది. అమరావతిలో రూ.800, సూపర్ లగర్జరీ రూ.650లు ఛార్జీలు. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ మాత్రం ఏసీ టికెట్ ధరను రూ. వెయ్యి నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నాయి. అదే స్లీపర్‌ అయితే రూ.1,200-రూ.1,500 వరకు పెంచారు. నాన్‌ ఏసీ స్లీపర్‌ రూ.1,200. కొన్ని ట్రావెల్స్‌ ఏసీ సర్వీసుల్లో టిక్కెట్‌ ధరను ఏకంగా రూ.2,000-2,500 వరకూ వసూలు చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. విజయవాడకు బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే ఏసీ సర్వీసుల్లో టిక్కెట్‌ ధరలను రూ.2వేల వరకు పెంచారు. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వచ్చే బస్సుల్లో కూడా ఈ దందా కొనసాగుతోంది. అంతేకాదు ఈ ధరలు ఇంకా భారీగా పెరుగుతాయని చెబుతున్నారు.