డిసెంబర్‌ 2న అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు

Center has called for an all-party meeting on September 2

న్యూఢిల్లీః పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 4వ తేదీన సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 2వ తేదీన అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాలకు ఒకరోజు ముందు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది.

అయితే, ఈ సారి డిసెంబర్‌ 3వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలకు రెండు రోజుల ముందు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించారు. తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రాపై క్యాష్ ఫర్ క్వరీ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను కూడా ఈ సెషన్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్ సిఫార్సు చేసిన బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది.

డిసెంబర్‌ 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఐపీసీ , సీఆర్‌పీసీ , ఎవిడెన్స్‌ యాక్ట్‌ల సవరణలకు సంబంధించిన బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ బిల్లులకు సంబంధించిన మూడు నివేదికలు ఇప్పటికే కేంద్ర హోంశాఖ స్టాండింగ్‌ కమిటీకి చేరాయి. అదేవిధంగా పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎలక్షన్‌ కమిషనర్‌ల నియామకానికి సంబంధించిన బిల్లులపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరుగనుంది.

వాస్తవానికి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రతి ఏడాది నవంబర్‌ మూడో వారంలో ప్రారంభమై క్రిస్మస్‌ పండుగకు ముందు ముగుస్తాయి. కానీ, ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా పార్లమెంట్‌ వింటర్‌ సెషన్‌ మొదలవుతున్నది. ఎప్పటిలాగే క్రిస్మస్‌ పండుగకు ముందు సెషన్‌ ముగియనుంది.