బాల‌కృష్ణ‌కు ప్ర‌ముఖుల నుంచి శుభాకాంక్ష‌లు

నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలి.. చంద్రబాబు

హైదరాబాద్: నేడు నంద‌మూరి బాల‌కృష్ణ 61వ బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ‘హిందూపూర్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, నటుడిగా అసంఖ్యాక సినీ అభిమానులను పొందిన వెండితెర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాద బలం, కీర్తి సంపదల తోడుగా నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’ అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

‘బాలా మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. కథానాయకునిగా ఇటు సినీ అభిమానులకు, హిందూపూర్ శాసనసభ్యునిగా అటు ప్రజలకు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ నిష్కళంక, నిస్వార్థ ప్రేమను పంచుతున్న మీ ఔదార్యం మాకు ఆదర్శం. బాలా మావయ్యా! మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని… అభిమానులకు నిత్య సంబరాలు జరుపుకునేలా, మరెన్నో చిత్రాలలో, విభిన్న పాత్రలలో నటిస్తూ నిండు నూరేళ్లూ వర్ధిల్లేలా దీవించమని ఆ దేవుని కోరుకుంటున్నాను’ అని నారా లోకేశ్ అన్నారు.

‘మిత్రుడు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సినీన‌టుడు చిరంజీవి ట్వీట్ చేశారు.

‘జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్. మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సినీన‌టుడు ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/