చంద్రబాబుకు బెయిలు.. సంబరాలతో హోరెత్తిస్తున్న టిడిపి శ్రేణులు

బాణాసంచా కాలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ టిడిపి శ్రేణుల సంబరాలు

Celebration of TDP leaders at NTR Trust Bhavan

హైదరాబాద్‌ః స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి 52 రోజులపాటు జైలులో ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా పేలుస్తూ కార్యకర్తలు, నాయకులు సంతోషంలో మునిగిపోయారు. అంతేకాక రాజమండ్రి, హిందూపురం సహా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘బాబు ఈజ్ బ్యాక్’, ‘నిజం గెలిచింది’ వంటి హ్యాష్‌టాగ్‌లను జత చేస్తున్నారు. ఇప్పుడివి ట్రెండ్ అవుతున్నాయి.

చంద్రబాబునాయుడు ఆరోగ్య కారణాల నేపథ్యంలో పెట్టుకున్న పిటిషన్‌కు ఆమోదం తెలిపిన న్యాయస్థానం ఆయనకు నాలుగు వారాల బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 28వ తేదీ వరకు ఆయన బెయిలుపై ఉండనున్నారు. ఆరోజు సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. కాగా, ప్రధాన బెయిలు పిటిషన్ వచ్చే నెల 10న విచారణకు రానుంది.