సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌

99.37 శాతం మంది ఉత్తీర్ణులు

న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇంటర్ సెకండ్ (ప్లస్ 2) ఇయర్ ఫలితాలను విడుదల చేసింది. 99.37 శాతం మంది పాసైనట్టు ప్రకటించింది. మొత్తం 12,96,318 మంది విద్యార్థులు పాసయ్యారని పేర్కొంది. విద్యార్థులు సీబీఎస్ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ధ్రువపత్రాన్ని పొందవచ్చని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీబీఎస్ఈ అన్ని పరీక్షలనూ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గత పరీక్షల్లో (ప్లస్ 2 యూనిట్ టెస్ట్, ప్రీ బోర్డ్ పరీక్షలు, ప్లస్ 1 థియరీ వార్షిక పరీక్షల) ప్రతిభ ఆధారంగా, ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 40:30:30 నిష్పత్తిలో ప్లస్ 2కు మార్కులను కేటాయించారు. అయితే, వేలాది మంది విద్యార్థుల ఫలితాలను పెండింగ్ లో పెట్టారు. 65,814 మంది విద్యార్థుల ఫలితాలను పరిశీలిస్తున్నామని, ఆగస్టు 5 నాటికి వారి రిజల్ట్ ను వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

కాగా, ఈసారి ఫలితాల్లోనూ అమ్మాయిలదే పై చేయి అయింది. అబ్బాయిలకన్నా 0.54 శాతం మంది ఎక్కువ అమ్మాయిలు పాసయ్యారు. మొత్తంగా 70,004 మంది విద్యార్థులకు 95 శాతానికిపైగా మార్కులు వచ్చాయి. 1,50,512 మంది విద్యార్థులు 90 నుంచి 95 శాతం మార్కులు సాధించారు. మార్కుల మెమోలు, పాసైన సర్టిఫికెట్లు, టీసీలు, స్కిల్ సర్టిఫికెట్లను cbse.digitallocker.gov.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని సీబీఎస్ఈ తెలిపింది. ఇక, తొలిసారి విదేశీ విద్యార్థులకు డిజిటల్ సర్టిఫికెట్లను అందిస్తోంది. కంపార్ట్ మెంట్ విద్యార్థుల కోసం ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 మధ్య పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :