మరోసారి ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు

సోమవారం విచారణకు రావాలంటూ పిలుపు

cbi-issues-another-notice-to-mp-avinash-reddy-on-saturday

హైదరాబాద్‌ః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీ చేసింది. సోమవారం (ఈ నెల 22న) విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారించారు. ఇటీవల మరోమారు నోటీసులు జారీ చేయగా.. ముందస్తు అపాయింట్ మెంట్ లు ఉండడంతో విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు ఎంపీ లేఖ రాశారు. నాలుగు రోజులు గడువు ఇవ్వాలని అధికారులను కోరారు.

దీంతో ఈ నెల 19న విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు పంపారు. అయితే, అవినాశ్ రెడ్డి తల్లికి అనారోగ్యానికి గురవడంతో శుక్రవారం ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో శుక్రవారం కూడా అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు శనివారం మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న (సోమవారం) హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని అందులో సూచించారు.