కేఏ పాల్‌తో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటి

cbi-ex-jd-lakshminarayana-meets-ka-paul

విశాఖః విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం కోసం తన ఆస్తులను కూడా అమ్ముతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని… తనను అరెస్ట్ చేయాలని కూడా చూస్తున్నారని చెప్పారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కేఏ పాల్ ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని… ఇందులో భాగంగానే పాల్ ను కలిశానని చెప్పారు.

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ..సిఎం కెసిఆర్‌పై విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్డింగ్ వేస్తామన్న కెసిఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ… సొంత రాష్ట్రం తెలంగాణను కూడా కాపాడలేని నీవు… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడతావా అంటూ మండిపడ్డారు. కెసిఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణను అప్పులపాలు చేశారని… ఇప్పుడు అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. దొంగ పాలకులు కావాలంటే ఇప్పుడున్న పాలకులనే మళ్లీ ఎన్నుకోవాలని… మీ హక్కులు మీకు కావాలనుకుంటే ప్రజాశాంతి పార్టీకి మద్దతును ఇవ్వాలని ప్రజలను కోరారు. తమ్ముడు పవన్ కల్యాణ్ బిజెపిని వదిలి బయటకు రావాలని చెప్పారు. జనసేనను ప్రజాశాంతి పార్టీలో కలపాలని అన్నారు.