కంటి సమస్యలు ఉన్నవారికి గాంధీ ఆసుపత్రి తీపి కబురు

కంటి సమస్యలతో బాధపడుతున్న వారికీ గాంధీ హాస్పటల్ తీపి కబురు తెలిపింది. కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక సౌకార్యలను ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మాట్లాడుతూ..కంటి సమస్యలున్నవారు చికిత్స కోసం గాంధీకి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా హాస్పిటల్‌లో ఉన్న ఆప్తమాలజి విభాగంలో ఆపరేషన్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాన్‌కోవిడ్ సేవలు పున:ప్రారంభమైన క్రమంలో కంటి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ‘కాటరాక్ట్’ సర్జరీలను అంటే కంటిలో ఏర్పడిన శుక్లాలను తొలగించే ఆపరేషన్‌లను ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఇందుకోసం మూడవ అంతస్తులో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్‌తో పాటు 20 పడకలను కంటి రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆప్తమాలజి విభాగం ఆధ్వర్యంలో ఇక నుంచి కంటి సమస్యలకు సంబంధించి ఓపి సేవలతో పాటు శస్త్రచికిత్సలను సైతం నిర్వహిస్తామని ఆప్తమాలజి విభాగాధిపతి డాక్టర్ రవిశేఖర్‌తో కలిసి డాక్టర్ రాజారావు బుధవారం మీడియాకు వెల్లడించారు.