అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేశ్‌పై కేసు నమోదు

ఏపీ ఎన్నికల వేళ కూటమి పార్టీకి షాక్ తగిలింది. కూటమి తరపున ఎన్నికలబరిలోకి దిగిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన పోలీస్ కేసు నమోదు చేసారు. ఓ టైల్స్ షాపు యజమాని వద్దకు జిఎస్టి సక్రమంగా కట్టడం లేదని డిఆర్ఐ అధికారులు వెళ్లి తనిఖీలు చేస్తున్న క్రమంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అధికారులను బెదిరించారని సీఎం రమేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

జిల్లాలోని చోడవరం మండలం గాంధీ గ్రామంలో గురువారం రాత్రి టైల్స్ దుకాణంలో అధికారుల తనిఖీల సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. డీఆర్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.ఎస్. కె. సోమేశ్ ఫిర్యాదు మేరకు సీఎం రమేశ్, కేఎస్ఎన్ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి శిలపరశెట్టి బుచ్చిబాబు, ఆయన ఇద్దరు కుమార్తెలతో పాటు సోదరుడు రామకృష్ణ అలియాస్ శ్రీనివాస్‌పై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తనిఖీలు చేస్తుండగా అధికారులను అడ్డుకోవడంతో పాటు వారి నుంచి రికార్డులను లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు చెప్పారు.