ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. డ్రైవర్లు, కండక్టర్లకు సెలవు రద్దు

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్..ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చింది. ముఖ్యంగా మహాలక్ష్మి పధకానికి మహిళలు బ్రహ్మ రధం పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ గా ప్రయాణం చేసే సదుపాయం కల్పించడం తో అన్ని బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. గతంలో వివిధ రూట్లలో పల్లెటూరి బస్సుల్లో ప్రయాణించే వారు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఎక్స్ ప్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. గత ఆదివారం (డిసెంబర్ 3)తో పోలిస్తే ఈ ఆదివారం (డిసెంబర్ 10) దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

బస్సు ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు. టిమ్స్‌లో ‘జీరో టికెట్‌’ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చాక వాస్తవ సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. నేడు కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్ల సెలవులను రద్దు చేశారు. సిబ్బందికి సెలవులు లేవని, విధులకు హాజరుకావాలన్నారు. వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, రామప్ప వంటి శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.