ఈ విషయాన్ని ముందే భారత్ తో పంచుకున్నాం : కెనడా ప్రధాని

రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం

Canada shared evidence of ‘credible allegations’ on Nijjar’s killing with India

ఒట్టావాః ఖలిస్థాన్ ఉగ్రవాది హత్యోదంతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై తన దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హత్యలో భారత్ ప్రభుత్వ ప్రమేయానికి సంబంధించి విశ్వసనీయమైన ఆరోపణలను కొన్ని వారాల ముందే భారత్ తో పంచుకున్నామని తాజాగా ఆయన ప్రకటించారు. శుక్రవారం మరోసారి ట్రూడో మీడియాతో మాట్లాడారు. ”సోమవారం నేను మాట్లాడిన దాని గురించి కొన్ని వారాల ముందే భారత్ తో పంచుకున్నాం. భారత్ తో కలసి నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు చూస్తున్నాం. భారత్ మాతో కలసి పనిచేస్తుందని భావిస్తున్నాం. అప్పుడు ఈ అంశంలో మరింత ముందుకు వెళ్లొచ్చు’’ అని ట్రూడో పేర్కొన్నారు.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయానికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయంటూ జస్టిన్ ట్రూడో గత సోమవారం కెనడా పార్లమెంటుకు వెల్లడించడం తెలిసిందే. అనంతరం భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్, కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశ బహిష్కరణ చేస్తూ, కెనడా వాసులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రెండు దేశాల మధ్య వాతావరణం ఉప్పు నిప్పుగా మారిపోయింది.