దేశంలో ఎవరూ పదేళ్లపాటు బెయిలుపై బయట లేరు.. ఇదో రికార్డుః పట్టాభి ఎద్దేవా

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ ఘనత రికార్డు చేయాలని విజ్ఞప్తి

tdp-leader-pattabhi-comments-on-ys-jagan-in-longest-bail

అమరావతిః సిఎం జగన్‌ బెయిలుపై బయట ఉండి నేటికి 10 సంవత్సరాలు పూర్తయిందని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిరాం పేర్కొన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీ అవినీతికి పాల్పడిన కేసుల్లో అరెస్ట్ అయిన జగన్‌కు 23 సెప్టెంబరు 2013న బెయిలు మంజూరైనట్టు చెప్పారు. అప్పటి ఇప్పటి వరకు పదేళ్లుగా కోర్టుల నుంచి తప్పించుకుని బెయిలుపై తిరుగుతున్నారని విమర్శించారు.

దేశంలో ఇదో రికార్డని, ఇప్పటి వరకు దేశంలో ఎవరూ ఇలాంటి ఘనత సాధించలేదని ఎద్దేవా చేశారు. కాబట్టి కోర్టు బెయిలుపై పదేళ్లుగా బయట ఉంటున్నందుకు ఈ రికార్డును ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయాలని ఆ సంస్థకు విజ్ఞప్తి చేశారు.ఈ రికార్డు సర్టిఫికెట్‌ను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు చక్కగా ఫ్రేమ్ కట్టి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి అందజేస్తారని జగన్‌ ఉద్దేశించి పట్టాభిరామ్ పేర్కొన్నారు.

జగన్ ఏ కాలేజీ చదువుకున్నారో, ఏ సర్టిఫికెట్ వచ్చిందో ఎవరికీ ఇప్పటి వరకు తెలియదని, కాబట్టి ఇండియాబుక్ ఆఫ్ రికార్డ్స్ అందించే ఈ సర్టిఫికెట్‌ను ఇంటి గోడలతోపాటు పార్టీ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఈ సర్టిఫికెట్‌ను ప్రముఖంగా ప్రదర్శించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ఇప్పటి వరకు ఓ వ్యక్తి ఎవరూ దేశంలో ఇన్నేళ్లుగా బెయిలుపై ఉన్న ఘనత సాధించలేదని పట్టాభి ఎద్దేవా చేశారు.