మహిళల కనీస వివాహ వయసు 21 ఏండ్ల‌కు పెంపు!

న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకు అవసరమైన చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ‌తేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఈ విష‌యాన్ని మోడీ తొలిసారి ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. పౌష్టికాహార లోపం నుంచి ఆడపిల్లలను రక్షించాలంటే వారికి సరైన సమయంలో పెళ్లి చేయాలని మోదీ సూచించారు. ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21.. మహిళల వ‌య‌సు 18 సంవత్సరాలు కల్పిస్తూ గ‌తంలో కేంద్రం చ‌ట్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టంలో సవరణలు తీసుకొచ్చి దానికి ఒక రూపం ఇవ్వనున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. నీతి ఆయోగ్‌లో జయ జైట్లీ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ విధమైన మార్పులను కేంద్రం తీసుకురానుంది. గ‌తేడాది జూన్‌లో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ.. ఆరు నెల‌ల్లోనే నివేదిక సమర్పించింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ కీలక సూచ‌న చేసింది. టాస్క్‌ఫోర్స్ సూచనలతో.. ఒక నివేదికను కేంద్రానికి నీతి ఆయోగ్ అందించింది. నీతి ఆయోగ్ నివేదికపై నిన్నటి క్యాబినెట్‌లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/