కనకదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించిన బుద్దా వెంకన్న

విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు విన్నపం

Buddha Venkanna who organized a rally to Kanakadurgamma temple

అమరావతిః ఏపిలో రానున్న ఎన్నికల కోసం టిడిపి, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జనసేనకు ఏయే నియోజకవర్గాలను కేటాయిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. పొత్తు నేపథ్యంలో పలువురు టిడిపి నేతలు టికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ టిడిపి నేత బుద్దా వెంకన్న విజయవాడ వెస్ట్ లో బల ప్రదర్శన చేశారు. కనకదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు తనకు దైవ సమానులని, ఆయనకు ఇచ్చే అప్లికేషన్ ను ముందుగా అమ్మవారికి ఇచ్చానని చెప్పారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని అప్లికేషన్ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రాణాలకు తెగించి టిడిపి కోసం పోరాడుతున్నానని… ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని అర్హతలు తనకు ఉన్నాయని చెప్పారు. తనకు టికెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కోరుతున్నానని తెలిపారు.

తన విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని బుద్దా వెంకన్న అన్నారు. టికెట్ రాలేదని చంద్రబాబును ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తానని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సిపి నేత, ఎంపీ కేశినేని నానికి బుద్ధి చెప్పాలనే తాను ర్యాలీగా వచ్చానని చెప్పారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోబోనని చెప్పారు. పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టికెట్లు ఇవ్వాలని కోరారు.