టీడీపీ బీసీ నేతలే లక్ష్యంగా విజయసాయిరెడ్డి కుట్ర‌లు

టీడీపీ నేత‌ల‌ను తమ దారికి తెచ్చుకోవాలని వైస్సార్సీపీ య‌త్నం..బుద్ధా వెంక‌న్న‌

అమరావతి: టీడీపీ నేత‌ బుద్ధా వెంకన్న వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ నేత‌ల‌కు చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తూ వారిని తమ దారికి తెచ్చుకోవాలని ప్ర‌య‌త్నిస్తున్నారని, టీడీపీ బీసీ నేతలే లక్ష్యంగా విజయసాయిరెడ్డి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని ఆరోపించారు. త‌మ పార్టీ నేత‌లు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడితో పాటు వారి అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను, రౌడీషీట్లను వెంట‌నే ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు.

త‌మ పార్టీ నేత‌ లోకేశ్ పై వైస్సార్సీపీ నేత‌లు చేస్తోన్న వ్యాఖ్య‌లు స‌రికాద‌ని బుద్ధా వెంక‌న్న చెప్పారు. టీడీపీ కార్యకర్తలను హత్య చేశారన్న కోపంలో లోకేశ్ విమ‌ర్శ‌లు చేస్తే ఆయ‌న‌పై వైస్సార్సీపీ నేత‌లు తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు. జగన్ లా లోకేశ్ ఎన్న‌డూ వ్యక్తిగత దూషణలు చేయలేదని ఆయ‌న చెప్పారు. వైస్సార్సీపీ నేతల వ్యాఖ్యలకు ప్రజలు కూడా భయపడుతున్నారని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/