నేడు హైదరాబాద్​కు రానున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి

BSP chief Mayawati is coming to Hyderabad today

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు ఇతర పార్టీలో ప్రచారంలో జోరు పెంచాయి. ఇందులో భాగంగా బీఎస్పీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత్రి మాయావతి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందు కోసం ఆమె ఈరోజు సాయంత్రం హైదరాబాద్​కు రానున్నారు. రాత్రి పార్క్‌ హయత్ హోటల్‌లో బస చేయనున్న మాయావతి.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు.

బుధవారం ఉదయం 11 గంటలకు సూర్యాపేటలో నిర్వహించనున్న బీఎస్పీ బహిరంగ సభలో మాయావతి పాల్గొననున్నారు. గురువారం రోజున పెద్దపల్లిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మాయావతి పర్యటకు బీఎస్పీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించే పనిలో పడ్డారు.

మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ప్రచారంలో జోరును పెంచారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ పని చేస్తుందని ఆయన తెలిపారు. అధికార పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్న వారిపై పోలీసు కేసులు పెట్టి, నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శించారు. ఏనుగు గుర్తుపై ఓటు వేసి రాజ్యాధికార స్థాపనకు ప్రతీ ఓటర్ సహకరించాలని ఆయన కోరారు.