అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శనివారం ఈడీ ఎదుట హాజరైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈడీ అధికారులు కవితను విచారించడం మొదలుపెట్టారు. దాదాపు 09 గంటలపాటు కవిత ను విచారించిన అధికారులు తిరిగి 16 న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు. విచారణ మధ్యలో 10 నిమిషాల పాటు కవిత కు బ్రేక్ ఇచ్చారు.

విచారణ పూర్తి కాగానే కవిత నేరుగా ఢిల్లీ లోని ఇంటికి వెళ్లిపోయారు. ఢిల్లీ లోని తన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు మహిళా నేతలు గుమ్మడికాయతో దిష్టితీసి ఇంట్లోకి ఆహ్వానించారు. అలాగే కవితను ఆలింగనం చేసుకొని సంతోషం వ్యక్తం చేసారు. కవిత పక్కన ఆమె భర్త, ఇతర బంధువులు ఉన్నారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. అర్ధరాత్రి 12.10 గంటలకు బేగంపేట చేరుకున్న కవిత అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు.