రామ్ తో బోయపాటి సినిమా ప్రారంభం..

వారియర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో రామ్..ఈరోజు బుధువారం మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. అఖండ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో రామ్ కొత్త చిత్రాన్ని చేయబోతున్నాడు. పాన్ ఇండియా గా తెరకెక్కబోయే ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం బోయపాటి కి 10 వ చిత్రం కాగా, రామ్ కు 20 వ చిత్రం కావడం విశేషం. రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం , ‘ది వారియర్’ తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం అన్నారు.

ఇక వారియర్ విషయానికి వస్తే..తమిళ డైరెక్టర్ లింగుసామి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రామ్ లుక్ ఒకటి విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి రామ్‌ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. జులై 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.