మూడు నెలల చిన్నారి మృతి ఫై ట్రాఫిక్ పోలీసుల ఫై డీకే అరుణ ఫైర్

యాదాద్రిలో ట్రాఫిక్​ పోలీసుల నిర్వాకం కారణంగా మూడు నెలల పసికందు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని నింపుతుంది. ఈ ఘటన పట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు. చిన్నారి మృతికి కచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు. నిండు నూరేళ్ళు జీవించాల్సిన చిన్నారి పోలీసుల నియంత ధోరణికి బలి అయ్యాడని మండిపడ్డారు. తల్లి తండ్రుల కడుపు కోతకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.

జనగాం జిల్లా మరిగడి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతులకు మూడు నెలల క్రితం కొడుకు జన్మించాడు. కాగా పసికందు అనారోగ్యానికి గురి కావడంతో మంగళవారం జనగాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. బాబు పరిస్థితి సీరియస్​గా ఉందని, వెంటనే హైదరాబాద్​లోని నీలోఫర్​ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు తెలిపారు. దీంతో వారు ఓ కారును అద్దెకు తీసుకొని హైదరాబాద్​కు బయల్దేరారు. వరంగల్​– హైదరాబాద్​ హైవేపై వంగపల్లి దగ్గర ట్రాఫిక్​ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు.

మల్లేశం దంపతులు ప్రయాణిస్తున్న కారుపై రూ.1000 పెండింగ్​ చలానా ఉంది. అది క్లియర్​ చేస్తే కానీ కారును వదలేదిలేదని పోలీసులు తేల్చిచెప్పారు. బాబుకు ఆరోగ్యం బాలేదని, హైదరాబాద్​లోని ఆస్పత్రికి తీసుకెళుతున్నామని బతిలాడినా వినిపించుకోలేదని సరస్వతి చెప్పారు. చలాన్ కట్టిన తర్వాత వదిలిపెట్టారని ,ఆ తర్వాత నీలోఫర్​ ఆస్పత్రికి చేరుకునే సరికి ఆలస్యమైందని, అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు చెప్పారన్నారు. ట్రాఫిక్ పోలీసుల వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఫై మహిళా సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ..దీనికి కారణమైన పోలీసులను విధుల్లో నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.