రాయదుర్గం పబ్ లో ఘర్షణ..ఒకరి పరిస్థితి విషమం

హైదరాబాద్ నగరంలో వీకెండ్ వచ్చిదంటే చాలు పబ్స్ అన్ని కూడా సందడిగా మారుతుంటాయి. సినీ ప్రముఖులు , ఐటి ఉద్యోగులు , బడాబాబుల కుమారులు , కూతుళ్లు ఇలా చాలామంది పబ్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు పబ్స్ లలో గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఘటనలు జరిగాయి. తాజాగా రాయదుర్గం పబ్ లో ఇలాంటి గొడవే జరిగింది. ఈ గొడవలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ఎదురుగా ఓ పబ్ ఉంది. అందులో పబ్ బౌన్సర్ అమీర్- సర్వీస్ కెప్టెన్ కృతిక్ పని చేస్తున్నారు. పబ్‌కి వచ్చిన కస్టమర్ విషయంలో వీళ్లిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య మాటలు కాస్త ఘర్షణకు దారి తీశాయి.

గొడవ జరుగుతున్న సమయంలో ఈ విషయం కృతిక్ ఫ్రెండ్స్ క్రాంతి, కల్యాణ్‌లకు తెలిసింది. వీరు మరో ఇద్దరిని వెంట బెట్టుకుని పబ్‌కి వచ్చారు. దీంతో వివాదం కాస్త ముదిరింది. చివరకు బౌన్సర్ అమీర్‌ కిచెన్‌ లోకి కత్తి తీసుకుని నలుగురిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కల్యాణ్, మల్లికార్జున్ కత్తిపోట్లకు గురయ్యారు. అందులో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వీరిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.