సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి

తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఎకె గోపాలన్‌ సెంటర్‌లో ఉన్న కార్యాలయంపై రాత్రి 11.30 గంటలకు ఈ దాడి జరిగింది. ఆ సమయంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పికె శ్రీమతి కార్యాలయంలోనే ఉన్నారు. బాంబు పార్టీ కార్యాలయం గేటు వద్ద పడటంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. సిసిటివి కెమెరాల్లో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి పేలుడు పదార్థాలను విసిరి పరారౌతున్న దృశ్యాలు ఉన్నాయి.

ఈ దాడిలో ఎవరు గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎకెజి సెంటర్ లో ఉన్న కొందరికి భారీ పేలుడు శబ్ధం వినిపించడంతో బయటకు వచ్చి చూడగా పార్టీ ఆఫీస్ కంపౌండ్ గోడ దెబ్బతిందని సిపిఎం కార్యకర్తలు వెల్లడించారు. కాంగ్రెసోళ్లు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని కమ్యూనిస్టు నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. వయనాడ్​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన కొన్ని రోజులకు ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల వయనాడ్​ పర్యటన కోసం కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. శుక్రవారం కేరళకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో బాంబు దాడి జరగడం చర్చల్లో నిలిచింది.