అమెరికా లో మరోసారి కాల్పుల ఘటన

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాస్ వెగాస్ సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్లలో ఐదుగురిని కాల్చి చంపి, 13 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు మంగళవారం తెలిపారు. నార్త్ లాస్ వెగాస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్లు వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరు మహిళలు చనిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు మరింత లోపలికి వెళ్లగా.. 13 ఏళ్ల బాలిక తీవ్రమైన తుపాకీ గాయాలతో ఉండడం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమీపంలోని మరో అపార్ట్‌మెంట్లో ఇద్దరు మహిళలు, ఓ యువకుడి మృతదేహాలను గుర్తించారు.

దుండగుడి కాల్పుల్లో మొత్తం ఐదుగురు చనిపోయారని పోలీసులు నిర్ధరించారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఒక దుకాణం దగ్గరల్లో నిందితుడు కనిపించాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకోగా దుండగుడు తుపాకీతో సమీపంలోని ఇంటి పెరట్లోకి పరిగెత్తాడు. తుపాకీ విడిచిపెట్టి లొంగిపోవాలని కోరినప్పటికీ అతడు నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. చివరకు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు