రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం..తొమ్మిదేళ్ల పిల్లాడికి హార్ట్ ఎటాక్

ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ తో చాలామంది చనిపోతున్నారు. ఒకప్పుడు 70-80 ఏళ్ల లోపు వారు ఎక్కువగా హార్ట్ ఎటాక్ తో చనిపోయేవారు. కానీ ఇప్పుడు ఆలా కాదు పట్టుమని పాతికేళ్లు లేని వారు సైతం హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. తాజాగా తొమ్మిదేళ్ల పిల్లాడు హార్ట్ ఎటాక్ తో చనిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిగ్రామానికి చెందిన బుర్ర కౌశిక్ గౌడ్ (09) ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం దీపావళి కావటంతో.. రాత్రి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా పండుగ సంబురాలు జరుపుకున్నాడు. ఉత్సాహంగా పటాకులు కూడా కాల్చాడు. ఉదయం లేచి.. యథావిధిగా పాఠాశాలకు హుషారుగా బయలుదేరి వెళ్లాడు. ఉదయం మొత్తం తరగతులు విన్న కౌశిక్.. మధ్యాహ్నం భోజనం కోసం అందరితో బయటికి వచ్చాడు. చేతిలో ప్లేటు పట్టుకుని స్నేహితులతో కలిసి లైన్‌లో నిల్చున్నాడు. అప్పటివరకు అందరితో సరదాగా ఉన్న కౌశిక్.. ఒక్కసారిగా క్యూలైన్‌లోనే కుప్పకూలిపోయాడు.

ఇది గమనించిన తోటి విద్యార్థులు టీచర్లకు సమాచారమిచ్చారు. వెంటనే టీచర్లు.. కౌశిక్‌ను గ్రామంలోని వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి గమనించిన వైద్యుడు.. కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు కౌశిక్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు తేల్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే కౌశిక్ ప్రాణాలు వదిలినట్టు తెలిపారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు. అప్పటివరకు ఎంతో హుషారుగా పాఠశాలకు వెళ్లిన తన కుమారుడు.. తిరిగి విగతజీవిగా రావటాన్ని చూసి గుండెలు బాదుకున్నారు. ఈ ఘటన తో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. అంత చిన్న వయసులో హార్ట్ ఎటాక్ రావడం ఏంటి అని మాట్లాడుకోవడం చేసారు.