తీన్మార్ మల్లన్న అరెస్ట్ ఫై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం

బీఆర్ఎస్ లీడర్ల అరాచకాలను మల్లన్న బయట పెడుతున్నారని, అందుకే ఆయనపై అక్రమ కేసులు నమోదు చేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేసారు. జర్నలిస్టు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. క్యూ న్యూస్ సిబ్బంది తనను నిర్బంధించి దాడి చేశారని సాయికరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నపై ఐపీసీ సెక్షన్లు 148, 307, 342, 506, 384, 109, r/w 149 కింద కేసులు నమోదు నమోదు చేసారు. ఈ క్రమంలో కోర్ట్ మల్లన్న తో పాటు నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

ఈ క్రమంలో మల్లన్న అరెస్ట్.. పోలీసుల తీరుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువారం పీర్జాదిగూడాలోని మల్లన్న కుటుంబాన్ని బీజేపీ నాయకులతో కలిసి విజయశాంతి పరామర్శించారు. బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న అక్రమాలను ఏ మీడియాలో ప్రసారం చేస్తే వాళ్ళ పై అక్రమ కేసులు నమోదు చేయడం చాలా దారుణమని అన్నారు. ఒక ఉద్యమకారుడిగా ఉన్న సీఎం కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమని తెలిపారు. మల్లన్న కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెప్తారని విజయశాంతి హెచ్చరించారు.