బిజెపి హైకమాండ్ ఏ బాధ్యతను అప్పగించినా స్వీకరిస్తా: కిరణ్ కుమార్ రెడ్డి

తాను ప్రజాజీవితంలోకి రావడానికి బిజెపి మాత్రమే ఉందన్న కిరణ్

bjp-is-only-option-for-me-says-kiran-kumar-reddy

విజయవాడః మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత కిరణ్ కుమార్ రెడ్డి విజయవాడలోని బిజెపి ఆఫీసులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని… ఒకటి ప్రజా జీవితంలో ఉండాలా? లేక వద్దా? అనేవే తన ముందు ఉన్న ఆప్షన్లు అని అన్నారు. యువకుడిగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, సౌత్ జోన్ కు ఆడానని చెప్పారు. ఇప్పుడు గోల్ఫ్ ఆడుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారని… ఆ పార్టీలో ఉండి చేసేదేమీ లేదని అన్నారు. తన ప్రైవేట్ లైఫ్ ను వదిలేసి, మళ్లీ ప్రజా జీవితంలోకి రావడానికి ప్రస్తుతం బిజెపి మాత్రమే తన ముందు ఉన్న ఏకైక మార్గమని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని మీడియా ప్రతినిధులు అడగగా… కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని అన్నారు. బిజెపి గురించే మాట్లాడుకుందామని చెప్పారు. రాష్ట్ర విభజన చేయడం వల్ల కాంగ్రెస్ భారీగా నష్టపోతుందని కాంగ్రెస్ హైకమాండ్ కు ఆనాడు చెప్పినా వారు వినలేదని… అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని చెప్పారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు తన హయాంలో లేవని అన్నారు. బిజెపి హైకమాండ్ తనకు ఏ బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతలను స్వీకరిస్తానని చెప్పారు. తాను పదవిని ఆశించి బిజెపిలో చేరలేదని అన్నారు. పార్టీ బలోపేతం కోసం తాను పని చేస్తానని చెప్పారు. ఇకపై రెగ్యులర్ గా ఏపీకి వస్తానని అన్నారు. ఏపీకి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పారు.