నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Chandrababu wrote a letter to UPSC

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు (బుధవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ప్రధాని మోడీ తో భేటీ అవుతారు. ఆ తరువాత హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి.

త్వరలో కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు చర్చించే అవకాశాలు ఉన్నాయి. పోలవరం, రాజధాని అమరావతి నగర నిర్మాణం సహా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీఏ నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు. గత ఐదేళ్లలో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, కేంద్రం అందించాల్సిన సహాయ, సహకారాలపై ఇప్పటికే మంత్రులతో చర్చించారు. ఆయా అంశాలపై అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో సమీక్షించారు.