సెప్టెంబర్‌ 17న పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు బిజెపి సిద్ధం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ డిసైడ్ అయ్యింది. సెప్టెంబర్‌ 17న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో విమోచన దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా గౌరవ వందనం స్వీకరించనున్నారు. సాంస్కృతిక శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు. మహారాష్ట్ర, కర్నాటకతో తెలంగాణ విమోచనానికి లింక్‌ ఉండటంతో ఏక్నాథ్ షిండే, బసవరాజు బొమ్మైకు ఆహ్వానం కూడా పంపించారు. గతంలో నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు జిల్లాలు ఉండటంతో.. వారిని కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గత కొద్దీ రోజులుగా బిజెపి నేతలు పదే పదే మజ్లిస్ పార్టీకి భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. తాము అధికారికంగా నిర్వహిస్తామని చెపుతూ వస్తున్నారు. ఇటీవల మునుగోడు లో జరిగిన బహిరంగ సభలోనూ అమిత్ షా ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. కానీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకముందే.. సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి ప్లాన్ చేసింది. ఆ రోజు తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన రోజు కాబోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.