బిల్కిస్ బానో అత్యాచారం కేసు.. దోషుల‌కు సుప్రీంలో చుక్కెదురు

supreme-cour

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న 11 మందికి సుప్రీంకోర్టు లో చుక్కెదురైంది. ఈ ఆదివారం లోగా అంద‌రూ స‌రెండ‌ర్ కావాల‌ని ఈరోజు అత్యున్న‌త న్యాయ స్థానం ఆదేశించింది. లొంగిపోయేందుకు మ‌రింత స‌మ‌యం ఇవ్వాల‌ని కోర్టును ఆ దోషులు అభ్య‌ర్థించారు. అయితే వారి అభ్య‌ర్థ‌న‌ను కోర్టు కొట్టిపారేసింది. 2002 గోద్రా అల్ల‌ర్ల స‌మ‌యంలో బిల్కిస్ బానోను రేప్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆ నిందితులు జైలుశిక్ష అనుభ‌వించారు. అయితే ఇటీవ‌ల క్ష‌మాభిక్ష ఆధారంగా వాళ్లు జైలు నుంచి రిలీజ్ అయ్యారు.

ఆ రిలీజ్‌ను స‌వాల్ చేస్తూ బిల్కిస్ కోర్టును ఆశ్ర‌యించారు. ఆమె అభ్య‌ర్థ‌న విన్న సుప్రీం.. దోషులు మ‌ళ్లీ స‌రెండర్ కావాల‌ని ఆదేశించింది. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ కోర్టుకెళ్లిన దోషుల‌కు చుక్కెదురైంది. జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న నేతృత్వంలోని బెంచ్ నేడు తీర్పును ఇచ్చింది. పిటీష‌న‌ర్ల వాద‌న‌లో ప‌స లేద‌ని, దోషులు మ‌ళ్లీ జైలుకు వెళ్లాల్సిందే అని కోర్టు పేర్కొన్న‌ది. అక్ర‌మ రీతిలో బిల్కిస్ దోషుల్ని విడుద‌ల చేసిన‌ట్లు గుజ‌రాత్ స‌ర్కార్‌పై సుప్రీం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.