భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉధృతి

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గడం తో లోతట్టు ప్రజలు , అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎగువన కురిసిన వర్షం , మూడు రోజులుగా తెలంగాణ లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటిమట్టం విపరీతంగా పెరిగింది. నిన్నటి నుండి వర్షం తగ్గుముఖం పట్టడం తో భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి తగ్గింది.

శుక్రవారం రాత్రి 10 గంటలకు 40.6 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 39.5 అడుగులకు తగ్గింది. గురువారం మధ్యాహ్నం ప్రవాహం 43 అడుగులకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు 41.10 అడుగులకు ప్రవాహం చేరుకున్నది. అప్రమత్తమైన అధికారులు భద్రాచలం నియోజకవర్గవ్యాప్తంగా 110 ముంపు గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల ప్రజలను 70 పునరాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం నీటిమట్టం తగ్గుతుండడం తో లోతట్టు ప్రజలు, అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండు రోజులుగా మంత్రి అజయ్‌కుమార్‌, భద్రాద్రి కలెక్టర్‌ ప్రియాంక ఆల, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ప్రత్యేకాధికారులు అనుదీప్‌, గౌతమ్‌ పోట్రు, కృష్ణ ఆదిత్య పట్టణంలో పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలను పర్యవేక్షించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడడం జరిగింది..