రామచంద్రన్‌ను ఆర్థిక నేరస్థుడిగా ప్ర‌క‌టించిన బెంగళూరు కోర్టు

Bengaluru court declares Devas Multimedia founder Ramachandran Viswanathan fugitive economic offender

బెంగళూరుః దేవాస్ మ‌ల్టీమీడియా సంస్థ సీఈవో రామచంద్ర‌న్ విశ్వ‌నాథ‌న్‌ ను ఆర్ధిక నేర‌స్థుడిగా ప్ర‌క‌టించారు. బెంగుళూరులోని స్పెష‌ల్ కోర్టు ఓ కేసులో ఈ ప్ర‌క‌ట‌న చేసింది. ఈడీ దాఖ‌లు చేసిన మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆయ‌న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. మొత్తం 9 మందిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇస్రోకు చెందిన వాణిజ్య శాఖ ఆంట్రిక్స్ కార్పొరేష‌న్ 579 కోట్ల‌లో దాదాపు 85 శాతం నిధుల్ని అమెరికాకు మ‌ళ్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2018లో న‌మోదు అయిన ఆ కేసులో రామ‌చంద్ర‌న్‌పై ఈడీ న‌జ‌ర్ పెట్టింది. ఆ కేసు ఆధారంగానే రామ‌చంద్ర‌న్‌ను ఆర్ధిక నేర‌స్థుడిగా ప్ర‌క‌టించారు.

ఇస్రో ప్ర‌యోగించిన రెండు ఉప‌గ్ర‌హాలను దేవాస్ వాడుకునే రీతిలో ఒప్పందం జ‌రిగింది. గ్రామీణ ప్రాంతాల‌కు మ‌ల్టీమీడియా సేవ‌ల్ని అందిచాల‌న్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు చేప‌ట్టారు. అయితే దేవాస్ మ‌ల్టీమీడియా కంపెనీని జాతీయ కంపెనీ చ‌ట్టాల ట్రిబ్యున‌ల్ లిక్విడేట్ చేసింది. తొలుత సీబీఐ, ఆ త‌ర్వాత ఈడీ వేర్వేరు కేసుల్ని న‌మోదు చేసింది. ఈ కేసులో విశ్వ‌నాథ‌న్ రెండో నిందితుడిగా ఉన్నారు. ప్రాసిక్యూట‌ర్ ప్ర‌స‌న్న కుమార్ గురువారం రోజున ఈ కేసుకు సంబంధించిన ప‌త్రాల‌ను జ‌డ్జి కేఎఏల్ అశోక్‌కు స‌మ‌ర్పించారు. విశ్వ‌నాథ‌న్‌ను ఆర్ధిక నేర‌స్థుడిగా ప్ర‌క‌టించాల‌న్నారు. ఆయ‌న ప్రాప‌ర్టీల‌ను సీజ్ చేయాల‌ని సూచించారు. విశ్వ‌నాథ‌న్‌కు నోటీసులు ఇచ్చిన కోర్టు.. ఆ త‌ర్వాత నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. ఫిజిటివ్ ఎక‌నామిక్ అఫెండ‌ర్ సెక్ష‌న్ 2(ఎఫ్‌) కింద కోర్టు విశ్వ‌నాథ‌న్‌ను దోషిగా తేల్చింది.