భాగ్యనగరంలో ప్రజలెవరూ బయటకు రావొద్దంటూ మేయర్ హెచ్చరిక

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ నగరవాసులకు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్‌ ప్రజలు దయచేసి బయటకు రావొద్దని తెలిపింది. హైదరాబాద్‌ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన చేసిన నేపథ్యంలో మేయర్ ప్రజలను అలర్ట్ చేసారు. గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ లో రెండు రోజులుగా ముసురు వర్షం పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం తడిసిముద్దవుతోంది.

ఉదయం ఆఫీసులకు , స్కూల్స్ , కాలేజీలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క గంటల కొద్దీ ట్రాఫిక్ జాం తో నరకయాతన పడుతున్నారు. హైదరాబాద్‌ లో మరో నాలుగు నుంచి ఐదు గంటలు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ వెస్ట్, నార్త్, సెంట్రల్ జోన్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ ప్రజలు దయచేసి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులను అప్రమత్తం చేశారు.

శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు.