బండి సంజయ్ ని కోర్ట్ లో హాజరుపరిచిన పోలీసులు

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్‌ ఆదివారం జన జాగరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కరోనా ఆంక్షల నేపథ్యంలో దీక్ష కు అనుమతి లేదని పోలీసులు.. కార్యాలయంలోకి వెళ్లి సంజయ్‌ దీక్ష ను భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఆ తర్వాత పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే బండి సంజయ్ జాగరణ దీక్షను కొనసాగించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి కరీంగనర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీదుగా బండి సంజయ్‌ను పోలీసులు తరలించారు.

ఈ నేపథ్యంలో బండి సంజయ్ సహా పలువురిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్, పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈరోజు బండి సంజయ్‌ని కరీంనగర్​ కోర్టుకు తరలించారు. బండి సంజయ్ తో పాటు మరో నలుగురిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. బండి సంజయ్ పై కోవిడ్ ఉల్లంఘనలుకు సంబంధించిన కేసులను పెట్టినట్లు తెలిసింది. అయితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే మరోవైపు బండి సంజయ్ తరుపున న్యాయవాదులు బెయిల్ కోసం అప్లై చేయనున్నారు.

ఇదిలా ఉంటె కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఫోన్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్నారని నడ్డాకు తెలిపారు బండి సంజయ్ కార్యాలయ సిబ్బంది. దీంతో వెంటనే స్పందించిన జేపీ నడ్డా ‘‘సంజయ్ జీకి నా మాటగా చెప్పండి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన సంజయ్ జీ చేస్తున్న పోరాటం భేష్.. కేసుల విషయంలో ఏం వర్రీ కావొద్దు.. మేం చూసుకుంటాం.. న్యాయ స్థానంలో మేం పోరాడతాం.. జాతీయ నాయకత్వం యావత్తు సంజయ్ జీ వెంట ఉంది. గో…హెడ్’’ అని భరోసా ఇచ్చారు.