మోడీ సభకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదంటూ ప్రశ్నించిన బండి సంజయ్

ఎప్పటిలాగానే ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. దీంతో కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. శనివారం హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్‌ ట్రైన్‌ను ప్రారంభించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు.

సభా వేదికగా.. రిమోట్ ద్వారా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు జాతీయ రహదారుల నిర్మాణం, బీబీ నగర్ ఎయిమ్స్ భవన నిర్మాణం, మహబూబ్ నగర్- చించోలి మార్గాన్ని 2 ప్యాకేజీలుగా విస్తరణ, ఖమ్మం – దేవరపల్లి రహదారిని 4 వరుసలతో గ్రీన్‌పీల్డ్ కారిడార్‌గా నిర్మాణం, MMTS రెండో దశను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం సభలో ప్రసంగించారు.

కాగా ఈ అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ హాజరుకపోవడం ఫై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ ఈరోజు షెడ్యూల్ బయటపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కోసం తాను చాలా ఎదురుచూశానన్న సంజయ్… కేసీఆర్ కు సన్మానం చేసేందుకు శాలువ కూడా తీసుకువచ్చానని అన్నారు. దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ ఎందుకు రారన్నారు. కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదని, కుటుంబ, నియంత, అవినీతి పాలన అంతం కావాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. కానీ రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదని ఆరోపించారు.