ప్ర‌జా సంగ్రామ యాత్ర రెండో రోజు : కేసీఆర్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్య‌లు

ప్ర‌జా సంగ్రామ యాత్ర లో భాగంగా రెండో రోజు బండి సంజయ్ పాల‌మూరు జిల్లాలో యాత్ర కొనసాగించారు. ఈ సందర్భాంగా కేసీఆర్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌ను గ‌ద్దె దించే స‌మ‌యం వ‌చ్చింద‌ని అన్నారు. భాజపా చేస్తున్న ఉద్యమాల వల్లే ఇన్నేళ్లు ఫాంహౌస్​కే పరిమితమైన ముఖ్యమంత్రి… ప్రగతి భవన్, ధర్నాచౌక్, ఇప్పుడు దేశం మొత్తం తిరుగుతున్నారని, ఆ ఘనత భాజపాదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

ఆర్డీఎస్ పథకాన్ని కుర్చీ వేసుకుని పూర్తి చేయిస్తానన్న ముఖ్యమంత్రి.. ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి వస్తే ఆర్టీఎస్ ద్వారా ఆయకట్టుకు నీళ్లిచ్చే బాధ్యత భాజపా తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఓ వైపు నీళ్లు రావ‌డం లేద‌ని పాల‌మూరు ప్ర‌జ‌లు చెబుతుంటే… ప‌చ్చ‌టి పాల‌మూరు ఎక్క‌డుందో కేటీఆరే చెప్పాల‌ని సంజ‌య్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట మేర‌కు ఎస్సీని సీఎం చేయ‌ని కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తామంటూ ప్ర‌క‌ట‌న చేయ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్రం లక్షా40వేల ఇళ్లిస్తే.. మోదీకి పేరొస్తుందని భయపడి రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ఎవరికీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని బండి సంజయ్​ ఆరోపించారు.

లక్షా40వేల ఇళ్లు ఎక్కడ నిర్మించారో జాబితా ఇస్తే.. మరో 2లక్షల ఇళ్లు కేంద్రం నుంచి మంజూరు చేయిస్తామని చెప్పినా.. ఇప్పటికీ జాబితా ఇవ్వడం లేదని మండిపడ్డారు. శ్మశాన వాటికలు, రోడ్లు, మురికి కాల్వలు, కమ్యూనిటీ హాళ్లు, ఇళ్లు వీటన్నింటికీ కేంద్రం నిధులిస్తుంటే తెరాస సర్కారు పేర్లు మార్చి ప్రజలను ఏమార్చుతున్నారని బండి సంజయ్​ వివరించారు. నిధులెవరిచ్చారో తెరాస సర్పంచ్​లు​, శాసనసభ్యులను నిలదీయాలన్నారు. అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగాన్ని మార్చి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు భాజపా అండగా ఉంటుందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటును అమ్ముకోకుండా భాజపాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు.