దుమారం రేపుతున్న వైసీపీ మంత్రి రష్యాటూర్ …

రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది..ఓ పక్క కరోనా ..మరోపక్క వర్షాలు..ఈ రెండింటితో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మా సమస్యలు పాటించుకోండి మహా ప్రభో అని నేతలను వేడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వారి సమస్యలు పట్టించుకోకుండా ఫారెన్ టూర్ కు వెళ్లడం ఎంతవరకు సబబు అంటూ తెలుగుదేశం నేతలు వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ని నిలదీస్తున్నారు.

రాష్ట్ర విధ్యుత్, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం రష్యాటూర్ ఉన్నారు. రష్యాకు వెళ్తున్న సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. విలాసవంతమైన ప్రైవేట్ జెట్ లో ఆయన రష్యా వెళ్లారు. జెట్ లో కూర్చున్న ఫోటోలను స్వ‌యంగా ఆయ‌నే తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేయ‌టం విశేషం. ఆ ఫోటో క్రింద “సాకులు వెతుక్కోకుండా జీవించండి…హాయిగా ప‌ర్య‌టించండి” అంటూ క్యాప్సన్ పెట్టారు. దీంతో ఈయనపై నెటిజన్లు , ప్రజలు , ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. పర్యటనలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని కొందరు అంటే.., ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం అంటూ మరి కొందరు సెటైర్ వేస్తున్నారు. ఇలాగైనా మా మంత్రికి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం మీద బాలినేని రష్యా టూర్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.