చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికొస్తారుః బాలకృష్ణ

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అంతా ఏకమవ్వాలి.. బాలకృష్ణ పిలుపు

balakrishna-press-meet-on-chandrababu-arrest

అమరావతిః ఏపిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అంతా ఒక్కటవ్వాలని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తాను వస్తున్నానని, ముందుండి నడుస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన పనిలేదని టిడిపి శ్రేణులకు, ప్రజలకు ధైర్యం చెప్పారు. అందరమూ కలిసి తెలుగు వాడి సత్తాను, పౌరుషాన్ని చూపిద్దామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని, చట్టాన్ని అతిక్రమించి మరీ జైలుకు పంపించారని మండిపడ్డారు. చంద్రబాబు కడిగిన ముత్యం లా బయటకు వస్తాడని స్పష్టం చేశారు. టిడిపి అధ్యక్షుడు పై కక్ష సాధింపు చేస్తున్నారని..స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి ఆరోపణలు చేసి చంద్రబాబు పై బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారని బాలకృష్ణ ఆగ్రహించారు. చంద్రబాబు అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్…ఇది ప్రపంచానికి తెలుసు…ఎటువంటి ఆధారాలు లేని స్కాం నీ ప్రభుత్వం క్రియేట్ చేసిందని ఆగ్రహించారు.

అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు జగన్ ఉపక్రమించారు. జగన్‌ 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్‌ కుట్ర పన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్… అధికారులే అమలు చేస్తారు. అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును అరెస్టు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్షసాధింపుతోనే కుట్ర చేశారు.

చంద్రబాబు అరెస్టు వార్త తెలిసి గుండెపోటుతో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలను ఓదార్చేందుకు తాను త్వరలో యాత్ర చేపడతానని వివరించారు. అదేవిధంగా చంద్రబాబు అరెస్టును ఖండించిన ప్రతీ ఒక్కరికీ, రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా నారసింహ శతకంలోని ఓ పద్యాన్ని బాలకృష్ణ వినిపించారు. గార్దభంబున కేల కస్తూరి తిలకంబు.. అని మొదలుపెట్టి మన రాష్ట్రమునకేల ఈ సీఎం జగను.. అంటూ ముగించారు.