మీ క్షేమమే నాకు ఆశీర్వాదం: బాలకృష్ణ

అభిమానులకు నందమూరి ‘నటసింహం’ బహిరంగ లేఖ

Balakrishna letter to fans
Balakrishna letter to fans

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది పుట్టినరోజు సందర్బంగా తన అభిమానులకు ముందుగానే బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి తెలియజేసారు. జూన్ 10న బాలయ్య 61వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్బంగా కరోనా నేపథ్యంలో అభిమానులు నేరుగా వచ్చి తనను కలిసే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేసారు. ప్రతి ఏడాది నా పుట్టినరోజును పండగలా జరుపుతున్న అభిమానులకు హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నారు. స్నేహితులు – శ్రేయోభిలాషులు – కుటుంబసభ్యులు మీతో పుట్టినరోజు వేడుకలు చేసుకోనే అదృష్టానికి అంతరాయం కలగడం చాలా భాధాకరంగా ఉందన్నారు. ఈ కరోనా మహమ్మారి ప్రభావం చూపుతున్న ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో మీ ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత. మీ క్షేమమే నాకు ఆశీర్వాదం అన్నారు.

“నా ప్రాణ సమానులైన అభిమానులకు.. ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలుదిక్కు లనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానం. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ.. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ.. మీ నందమూరి బాలకృష్ణ” అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/