సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డికి ద‌క్క‌ని ఊర‌ట‌

రాతపూర్వక అభ్యర్థన ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న సీజేఐ

avinash-reddy-filed-petition-in-supreme-court

న్యూఢిల్లీః కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో ఎంపీ చేసిన అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించలేదు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టేలా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి కోరగా.. రాతపూర్వక అభ్యర్థన ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ ఎంపీకి సీబీఐ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఎంపీ అవినాశ్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈమేరకు ఎంపీ అవినాశ్ తరఫున దాఖలు చేసిన పిటిషన్ ను ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. విచారణ తేదీని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఖరారు చేయలేదు. అత్యవసరమైతే రాతపూర్వక అభ్యర్థన ఇవ్వాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.