చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి డ్రైవర్ ఫై దాడి

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ డ్రైవర్‌ నాగరాజు(28)పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న నాగరాజును కుప్పం పురపాలక సంఘం పరిధిలోని లక్ష్మీపు రం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు. రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన నాగరాజు ప్రస్తుతం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.