పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసుపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పబ్ లో డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లు బయటపడడం, పెద్ద సంఖ్యలో సినీ , రాజకీయ , వ్యాపార రంగాలకు చెందిన వారు పబ్ కు వెళ్తూ ఉండడం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. దీనిపట్ల ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని చెపుతుంది.

పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. హైదరాబాద్ పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. రేవ్ పార్టీలో కొకైన్ దొరకడం దురదృష్టకరం అని ఆయన అన్నారు. రూల్ ఆఫ్ లా అందరికి సమానంగా ఉండాలని ఆయన అన్నారు. డ్రగ్స్ కేసులో పబ్ ఓనర్స్ ని మాత్రమే అరెస్ట్ చేస్తారా… బడా బాబుల పిల్లలను అరెస్ట్ చేయలేదని ఆయన అన్నారు. చట్టం ధనికులకు, పేదవారికి సమానంగా ఉండాలని ఆయన అన్నారు. కేటీఆర్, హైదరాబాద్ సీపీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

మరోపక్క ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు అభిషేక్, అనిల్‌ కుమార్‌ల ఫోన్ల ద్వారా వినియోగదారుల వివరాలను తెలుసుకున్నారు. పబ్బులో డ్రగ్స్ ఏర్పాట్లపై వారికి సంకేతపదాలతో సంక్షిప్త సందేశాలు పంపుతున్నారని గుర్తించారు. వారాంతాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో డ్రగ్స్‌ తీసుకునేందుకు 20 మంది వస్తున్నారనే సమాచారాన్ని సేకరించారు. అందులో ముగ్గురిపై గతంలో కేసులు నమోదుకావటంతో… వారి కాల్‌డేటా రికార్డులు పరిశీలిస్తున్నారు. రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న అభిషేక్‌, అనిల్‌కుమార్‌లను వారం రోజులు కస్టడీకి అప్పగించాలంటూ బంజారాహిల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టును బుధవారం అభ్యర్థించారు.