నేడు పల్నాడుకు సీఎం జగన్ .. వలంటీర్లకు సత్కారం

అమరావతి: సీఎం జగన్ నేడు పల్నాడులో పర్యటించనున్నారు. ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలోని గడప గడపకూ చేరవేస్తూ సేవలందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం నేడు సత్కరించనుంది. వలంటీర్ల నిబద్ధతను గుర్తిస్తూ వరుసగా రెండో ఏడాది సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరగనున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం జగన్‌ గురువారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు ఇందులో పాల్గొంటారు. వలంటీర్లను సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో సత్కరించడంతో పాటు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,33,333 మంది వలంటీర్లను సచివాలయాలవారీగా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరిస్తారు.

సచివాలయంలో బయోమెట్రిక్‌ హాజరు, పింఛన్ల పంపిణీ, కరోనా థర్డ్‌ వేవ్‌లో ఫీవర్‌ సర్వే తీరు అంశాల ఆధారంగా వలంటీర్లకు పాయింట్లు కేటాయించి మూడు విభాగాల్లో అవార్డులు అందించనున్నారు. సేవా వజ్ర అవార్డుకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున, సేవా రత్న అవార్డుకు ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున, నగర కార్పొరేషన్‌లో పది మంది చొప్పున ఎంపిక చేశారు. కనీసం ఒక ఏడాది పాటు బాధ్యతగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదు లేనివారిని సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేశారు.

గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 2,20,993 మంది వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించగా ఈ ఏడాది 2,33,333 మందిని సత్కరించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 875 మంది వలంటీర్లను సేవా వజ్ర అవార్డుతో పాటు రూ.30 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌తో సత్కరించనున్నారు. 4,136 మందికి సేవారత్న అవార్డుతో పాటు రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌ అందజేస్తారు. 2,28,322 మంది సేవా మిత్ర అవార్డుతో పాటు రూ.10 వేల బహుమతి అందుకోనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/