మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. రాష్ట్రానికి రాకేష్ బల్వాల్‌

As Manipur flares up again, senior police officer ordered back to state

ఇంఫాల్‌ః ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్‌ చేసి, హత్య చేసిన విషయం తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వారి మృతదేహాల ఫొటోలు సోషల్‌ మీడియాలో బయటకు రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యను నిరసిస్తూ విద్యార్థులు రెండో రోజు బుధవారం కూడా ఇంఫాల్‌ నగరంతోపాటు పలు ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ పోలీసు అధికారి రాకేష్ బల్వాల్‌ ను రంగంలోకి దింపింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎస్‌ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న బల్వాల్‌ను తన సొంత కేడర్‌ అయిన మణిపూర్‌కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాజస్థాన్‌కు చెందిన రాకేష్‌ బల్వాల్‌.. 2012 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. మణిపూర్‌ కేడర్‌లో ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2018లో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఎజెన్సీ కి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా పదోన్నతి పొందారు. 2019లో పుల్వామా ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపిన బృందంలో బల్వాల్‌ సభ్యుడిగా ఉన్నారు. 2021లో శ్రీనగర్‌లో సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టారు.

కాగా, మైతీ వ‌ర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు శ‌వ‌మై తేలారు. జూలైలో ఆచూకీలేకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఇద్దరి మృత‌దేహాల‌ను ఇంకా గుర్తించ‌లేదు. 17 ఏళ్ల హిజామ్ లింతోయింగంబి, 20 ఏళ్ల ఫిజ‌మ్ హేమ్‌జిత్ .. సాయుధుల మ‌ధ్య ఉన్న ఫోటోల‌ను రిలీజ్ చేశారు. ఆ త‌ర్వాత ఇద్దరూ చ‌నిపోయిన‌ట్లు ఉన్న ఫోటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఓ జంగిల్ క్యాంపు వ‌ద్ద ఆ ఇద్దరూ హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది. జూలై నుంచి అదృశ్యమైన ఆ ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు జ‌రుగుతోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తున్నది.