భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న సిక్కిం..300 మంది పర్యటకులను రక్షించిన అధికారులు

Army Rescues 300 More Tourists Stranded In North Sikkim

సిక్కిం: సిక్కింలో గత నాలుగు రోజులుగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో సుమారు 3,500 మంది పర్యటకులు ఉత్తర సిక్కిం జిల్లాలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్‌ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పెంగాంగ్‌ సప్లయ్‌ ఖోలా వద్ద మంగాన్‌ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌థాంగ్‌ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింది. దీనివల్ల రోడ్డు కోతకు గురవడంతో పాటు కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో లెచెన్‌, లచుంగ్‌ ప్రాంతాల్లో ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యటకులు అక్కడి హోటళ్లలోనే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. దీంతో పర్యటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిక్కిం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా ఇప్పటికే 1500 మంది పర్యటకులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి తరలించారు. తాజాగా ఉత్తర సిక్కిం జిల్లాలోని లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 300 మంది పర్యటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వారికి భోజన, వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.