ఏపీలో కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్

ఏపీలో కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మ‌రి కొన్ని గంట‌ల్లో బరిలో నిలిచినా అభ్యర్థుల భవితవ్యం తేల‌నున్న‌ది. 13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ కోసం11,803 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 32,264 సిబ్బందిని నియమించారు.

ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు, 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 స్ధానాల్లో నోటీఫికేష‌న్ విడుద‌ల కాగా.. 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో అభ్యర్ధుల మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8 న 7220 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిక‌ల్లో 18,782 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. నేడు వారి భ‌విత్వం తేల‌నున్న‌ది. సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫలితాల తర్వాత సంబరాలు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మద్యం షాపులు మూసేసి, 144 సెక్షన్‌ అమల్లోకి తీసుకొచ్చారు. కౌంటింగ్‌ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. అభ్యర్థి, కౌంటింగ్‌ ఏజెంట్లు రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తయినట్లు ధృవీకరణ పత్రం చూపాలి.