హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ లో బుధువారం ఉదయం 5 గంటల నుండి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ ఉరుములతో , ఈదురుగాలులతో వర్షం విరుచుకుపడింది. దీంతో భారీగా చెట్లు కూలిపోయాయి. నిన్నటి వరకు ఎండలతో అల్లాడిపోయిన నగరవాసులు ఇప్పుడు కాస్త చల్లపడ్డారు. భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షంతో దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేటతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పంజాగుట్ట కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు కూడా వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలోనూ భారీగా వర్షం పడింది. కుమ్రం భీం జిల్లాలోని బెజ్జూర్‌లో 7.6 సెంటీమీటర్లు, రవీంద్రనగర్ లో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల, సిద్దిపేట, హనుమకొండ, కామారెడ్డి, జనగామ, మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు పూర్తిగా తడిసిపోయాయి.

ఇక హైదరాబాద్ లో రెండు గంటల పాటు కురిసిన వర్షంతో..సీతాఫల్‌మండిలో 7.2 సెంటి మీటర్లు, బంసీలాల్‌పేట్‌లో 6.7, వెస్ట్‌మారేడ్‌పల్లిలో 6.1, అల్వాల్‌లో 5.9, ఎల్బీనగర్‌లో 5.6, బాలానగర్‌లో 5.4, ఏఎస్‌రావునగర్‌లో 5.1, పాటిగడ్డలో 4.9, మల్కాజ్‌గిరిలో 4.7, ఫలక్‌నుమాలో 4.6, గన్‌ఫౌండ్రీలో 4.4, సికింద్రాబాద్‌లో 4.3, చార్మినార్‌లో 4.2, నాచారంలో 4.1 సెం.మీ, అంబర్‌పేటలో 4.1, అమీర్‌పేటలో 3.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.