అమిత్ షా సమక్షంలో బిజెపి లో చేరిన రాజగోపాల్ రెడ్డి

మునుగోడు వేదికగా అమిత్ షా సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ బిజెపి పార్టీ లో చేరారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన రాజగోపాల్..ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. మరో రెండు , మూడు నెలల్లో మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో బిజెపి నుండి రాజగోపాల్ బరిలోకి దిగనున్నారు. మరి కాంగ్రెస్ , టిఆర్ఎస్ నుండి ఎవరు అభ్యర్థులుగా నిల్చుంటారో తెలియాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈరోజు బిజెపి సభ జరుగుతుంది.

ఇక రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే… కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటి చేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటిచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆయన 2022 ఆగస్టు 2న కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఈరోజు ఆగస్టు 21 న బిజెపి పార్టీలోకి అధికారికంగా వెళ్లారు.