నేడు హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ

సుక స్కాం కేసులో ఏ2 గా చంద్రబాబు

Chandrababu

అమరావతిః ఏపిలో ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ ఎండీసీ ఫిర్యాదు చేయడంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబును అధికారులు ఏ 2 గా చేర్చారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు కోర్టులో పిటిషన్ వేయగా.. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు జడ్జి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై బుధవారం (నేడు) హైకోర్టు విచారించనుంది.

టిడిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అవకతవకలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై ఏపీఎండీసీ ఫిర్యాదు చేయడంతో సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టింది. అయితే, ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణను చంద్రబాబు ఖండించారు. జగన్ సర్కారు కేవలం రాజకీయ దురుద్దేశంతో, తనను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం చేయడంతో పాటు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఇసుక ఉచిత పంపిణీ వల్ల ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూరిందని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఏ సంస్థ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని చంద్రబాబు వాదిస్తున్నారు.